Sunday, August 12, 2007

తెలుగులో క్రియాకల్పన సాధనాలు - 8

(Verbification Tools in Telugu)

తెలుగు ఉపసర్గలు
పూర్వీకుల పద్ధతిలోనే చిఱుధాతువుల తుమున్నంతాల్ని ఉపసర్గలుగా మార్చి నేను కల్పించిన క్రియాధాతువులు కొన్నింటిని ఇక్కడ ప్రదర్శనకి పెడుతున్నాను.నాలాగే అందరూ ప్రయత్నించగలరని మనవి.

1. అలియన్ + పల్కు = అలవల్కు = (మళ్ళీ మళ్ళీ పలుకు) వాదించు
2. విడన్ + పల్కు = విడబల్కు = (విడగొట్టి పలుకు) వివరించు
3. అకన్ + పల్కు - కాబల్కు = (అయ్యే విధముగా చెప్పు) జోస్యము చెప్పు
4. రాన్ + పల్కు = రాబల్కు = (వచ్చే విధముగా పలుకు) ఆహ్వానించు

5. (కవ అంటే జంట) కవన్ + కలుపు = కలుపు = కౌగల్పు (కౌగలించు లాగా) అనుసంధానించు

వీటినే నామవాచకాలుగా కూడా యథాతథంగా ప్రయోగించవచ్చు.

(ii) ఉపసర్గలుగా విభక్తి ప్రత్యయాలు :

విభక్తి ప్రత్యయాల్ని ఉపసర్గలుగా వాడుకునే సౌలభ్యమొకటి తెలుగులో ఉంది.విభక్తి ప్రత్యయాలంటే నామవాచకాలకు చివర వచ్చే తోన్, లోన్, పై, క్రీ (క్రిందు), మీన్ (మీదు) మొదలైనవి.

ఉదా:- తోన్ + పుట్టువు = తోబుట్టువు (కలిసి పుట్టినవాడు)
పైన్ + చరిమి = పైసరము ( పైకి జరుగుట - స్త్రీతో కలయిక)
క్రిన్ + కంటి = క్రీగంటి
మీన్ + కట్టు = మీగడ
మీదు + కట్టు = మీదుకట్టు, ముడుపుకట్టు to pledge

లోన్ + గుట్టు = లోగుట్టు

లోన్ + కొను + లోగొను (లొంగునట్లు చేసుకొను)

లోన్ + పడు = లోబడు (లొంగు)

లోన్ + పఱచుకొను (లోబఱచుకొను)

(iii) ఉపసర్గలుగా నామవాచకాలు

కవన్ + కలియించు = కవంగలించు --> కౌగలించు (తన జంటగా చేరేలా చేయు)

నామవాచకాన్ని క్రియాధాతువుతో కలిపి ప్రయోగించే ఇలాంటి ఉదాహరణల్ని "శబ్దపల్లవాలు" అంటారు.కాని కొన్నిసార్లు వీటిల్లో మొదటి పదం మనకు ఉపసర్గగా ఉపయోగపడుతుంది.

కొన్ని శబ్దపల్లవాలు :

ఉరితీయు
వలవిసురు
కన్నుమూయు
గురిపెట్టు
చేపట్టు
దారితీయు
దారిపట్టు
మనసుపడు
మన్సగు
తెఱదించు
మిన్నంటు
గాలిసోకు

మఱికొన్ని ఉపసర్గలు :

కొన్ని పదాలు ప్రాచీనకాలంలో విశేషణాలుగా ఉండి తరువాత్తరువాత ఉపసర్గల్లా ప్రవర్తించడం మొదలుపెట్టాయి.
ఉదా:- మరు + నాడు = మరుచటి నాడు
పెద + తల్లి = పెత్తల్లి
చెన్ను + కలువ = చెంగలువ మొ.

తెలుగులో క్రియాకల్పన సాధనాలు - 7

(Verbification Tools in Telugu)
తెలుగు ఉపసర్గలు


ఉపోద్ఘాతం : సంస్కృతం, ఇంగ్లీషు భాషల తరహాలో పదాలకు ముందు చేర్చదగిన ఉపసర్గలు (prefixes)తెలుగులో లేవు. కారణం-తెలుగుభాష, పదం పక్కన పదం/ప్రత్యయం చేరే టర్కిష్ మొదలైన భాషల కోవకు చెందినది. ఈ రకం భాషల్లో పదాలకు ముందు కాక తరువాత ప్రత్యయాలు చేరతాయి.

(i) ఉపసర్గలుగా తుమున్నంతాలు :

అయితే తెలుగులో అచ్చం ఉపసర్గల్లాగానే ప్రవర్తించే పదాలున్నాయి. ఈ క్రింది ఉదాహరణలు పరిశీలించండి :

ఎగన్ + తీయు = ఎగదీయు

దిగన్ + తీయు = దిగదీయు

అలియన్ + బడు = అలబడు --> అలవడు --> అలవాటు

అలియన్ + పోవు = అలబోవు --> అలబోక --> అలవోక

తడియన్ + పడు = తడబడు --> తడబాటు

పొఱియన్ + పడు = పొఱబడు --> పొఱబాటు

ఎడయన్ + పడు = ఎడబడు --> ఎడబాటు

ఒడియన్ + పడు = ఒడబడు --> ఒడబాటు

కలియన్ + పడు = కలబడు

కలియన్ + చూచు = కలియజూచు --> కలజూచు

అకన్ + చేయు = కాజేయు

పోవన్ + పడి = పోవబడి --> పోబడి

పోవన్ + కాలం = పోవగాలం --> పోగాలం

పెనగన్ + వేయు = పెనవేయు (పేనేట్లు వేయు)

పెనగన్ + కొను = పెనగొను (పేనుకొను) పైన ఫలితార్థంగా చూపించినవి ఇప్పుడు అందరికీ తెలిసిన శబ్ద స్వరూపాలు. సంధులుగా చూపించినవి ఆ స్వరూపాల మూలరూపాలు.వీటిని పరిశీలించినప్పుడు క్రియాధాతువుల తుమున్నంతాలే తెలుగులో ఉపసర్గల్లా ప్రవర్తిస్తాయని అర్థం చేసుకుంటాం. తుమున్నంతాలంటే - చెయ్యడానికి, పోవడానికి, చేయుటకు, పోవుటకు అని అర్థమిచ్చే క్రియారూపాలు. ఇవి ప్రాచీన తెలుగులో చేయన్, పోవన్, అనన్ అనే విధంగా ఉంటాయి. తుమున్నంతాలు పై అర్థాన్నే కాకుండా "చేసేలా పోయేలా" అనే విధంగా కూడా అర్థాన్నిస్తాయి.

ఉదా:- పోవన్ + కొట్టు = పోవగొట్టు --> పోగొట్టు = పోయేలా కొట్టు

చావన్ + కొట్టు = చావగొట్టు (చచ్చేలా కొట్టు)

లేవన్ + కొట్టు = లేవగొట్టు (లేచేలా కొట్టు) to evict somebody forcibly

నిజానికి ఈ నిర్మాణాలు క్రియాగుచ్ఛాలనే రకానికి చెందుతాయి.తెలుగులో క్రియ మీద క్రియ దండలాగా చేరే సౌలభ్యం ఒకటుంది.ఇతర భారతీయ భాషల్లో కూడా ఉందనుకోండి.కాని తెలుగులో ఉన్నంత విస్తారం కాదు.

ఉదా:-

1. పట్టుకోలేకపోయాడు (ఇందులో పట్టు, కొను, ఉండు-వ్యతిరేకార్థకం, పోవు అనే ధాతువులున్నాయి)
2. పడగొట్టగలడు (పడు + కొట్టు + కలుగు)

మనం తెలుగులో ఉపసర్గల్ని కల్పించాలంటే ముందు ఇలాంటి క్రియాగుచ్ఛాల్ని కల్పించాలన్నమాట. ఈ సందర్భంగా కొన్ని అంశాల్ని గమనంలో ఉంచుకోవాలి:

(అ) తెలుగు ఉపసర్గలు తుమున్నంతాలై ఉండాలి.
(ఆ) అవి తెలుగులిపిలో గరిష్ఠంగా మూడు అక్షరాలకు మించనివై ఉండాలి.
(ఇ) అవి ప్రసిద్ధ అర్థాన్నే కాక సంబంధిత వ్యంగ్యార్థాన్ని సైతం ఇవ్వాలి. అంటే ఒకే ఒక్క నిశ్చితార్థాన్ని ఇచ్చే విధంగా ప్రయోగించకూడదు.
(ఈ) ఉపసర్గల్ని ఏర్పఱిచే క్రమంలో పనికొస్తాయనుకున్న పాత ధాతువుల్ని సైతం పునరుద్ధరించడానికి వెనుకాడకూడదు.
(ఉ) క్లుప్తత నిమిత్తం అక్షరాల్ని కుదించడానికి అనుమతించాలి.
ఉదా: పొఱియన్ + పడు = పొఱబడు
(ఊ) సంస్కృతంలో లాగా తెలుగులో ఉపసర్గ మీద ఉపసర్గ చేర్చడం సాధ్యపడదు.
(ఎ) ఉపసర్గల్ని స్వతంత్రపదాల్లా ప్రయోగించకూడదు. అలా ప్రయోగిస్తే అవి నామవాచకాలవుతాయి. ప్రతి నామవాచకానికీ ఒక ఖచ్చితమైన అర్థం ఉంటుంది కనుక ఉపసర్గ సహిత పదాల అర్థంలో అవి చెడ్డజోక్యాన్ని కలిగించుకుంటాయి.

తెలుగులో క్రియాకల్పన సాధనాలు - 6

(Verbification Tools in Telugu)
బహువ్రీహి సమాసాన్ని"కలిగి ఉన్న/కలిగి లేని"అనే అర్థంలో వాడతారు.ముక్కంటి తమ్మిచూలి పులుమావి మొదలైన తెలుగుపదాల్లోను త్రినేత్రుడు చక్రపాణి మృగనయని మొదలైన సంస్కృత పదాల్లోను heavyweight featherweight southpaw (left-hander) మొదలైన ఇంగ్లీషు పదాల్లోని మనకు ఇలాంటి నిర్మాణం కనిపిస్తుంది.సమాసంలో కలుస్తున్న రెండు పదాలకు విడివిడిగా ఉన్న అర్థం కన్నా భిన్నమైన ఒక కొత్త అర్థాన్ని బహువ్రీహి ఇస్తుంది.కలుస్తున్న పదాల్ని కాక వాటి ద్వారా ఒక మూడో వస్తువుని/వ్యక్తిని అది సూచిస్తుంది.

బహువ్రీహిలో పదసమ్మేళనాలు (combinations) స్థూలంగా మూడు రకాలుగా ఉంటాయి.
1. నామవాచకం + నామవాచకం

ఉదా:-శూలపాణి - శూలము పాణియందు గలవాడు

2. విశేషణం + నామవాచకం

ఉదా:- ఆర్‌ద్ర హృదయుడు - తడిసిన/చల్లని హృదయం గలవాడు

3. క్రియావిశేషణం (past/present participle) + నామవాచకం

ఉదా:- నతగాత్రుడు - వంగిన గాత్రం (శరీరం) గలవాడు.

బహువ్రీహినే కాదు అసలు ఏ చిఱుసమాసాన్నయినా మనం క్రియాధాతువుగా మార్చేసి వాడుకోవచ్చు.High-lighting gate-crashing hitch-hiking tape- recording మొదలైన పదాల విషయంలో ఇంగ్లీషువారు అవలంబించిన విధానమిదే.శబ్దపల్లవాల రూపంలో తెలుగులో కూడా ఎప్పట్నుంచో ఈ పద్ధతి వాడుకలో ఉంది.ఈ క్రింది పదాలు ఉదాహరణల కోసం నిష్పాదించినవి.

1. సమయ పాలన - సమయపాలించు
2. వ్యాసరూపం - వ్యాసరూపించు (అలాగే, గద్యరూపించు - paraphrasing)
3. లిప్యంతరం - మరో లిపి లిప్యంతరించు - మరో లిపిలోకి మార్చు
4. ఉరిశిక్ష - ఉరిశిక్షించు - ఉరివేసి శిక్షించు
5. క్రమశిక్షణించు - క్రమశిక్షణలో పెట్టు (to discipline somebody)
6. ముంతేదించు - ముందటి తేదీ వేయు (pre-date)
7. మరుతేదించు - మరుసటి తేదీ వేయు (post-date) మొ.

బహువ్రీహితో కూడా మనం ఇలాంటి ప్రయోగాలు చెయ్యొచ్చు.

1. హతాశుడు - హతాశించు - నిరాశించు, నిరాశపరచు (to frustrate)
2. (వారసించు - వరసుడుగా చేయు x ) అవారసించు - వారసత్వానికి అనర్హుడుగా చేయు disinherit) అలాగే, నిర్వారసించు - వారసులు లేకుండా చేయు
3. దృఢదీక్షిల్లు - గట్టి పట్టుదల పట్టు (సకర్మకంగా అయితే-దృఢదీక్షించు-గట్టి పట్టుదల పట్టేలా చేయు)
4. కృతనిశ్చయిల్లు - కృతనిశ్చయుడు/రాలు అగు (సకర్మకంగా అయితే-కృతనిశ్చయించు - గట్టి నిర్ణయం తీసుకునేలా చేయు)
5. వేగవంతించు - వేగిరపఱచు (to expedite, to accelerate)

బహువ్రీహి అంటే "పెక్కు వరిపంటలు"అని అర్థం.వరిలో ఎన్ని రకాలున్నాయో బహువ్రీహిలో అన్ని రకాలున్నాయట. మరో రకం బహువ్రీహి ఇలా ఉంటుంది.

ఉప + దశ = పదికి దగ్గరగా (9 కావచ్చు, 11 కావచ్చు)
దీన్నుంచి మనం నిష్పాదించగల క్రియాధాతువు : ఉపదశించు - పదికి దగ్గరగా పూర్ణాంకం వేయు (round figure చేయు)
ఇదే క్రమంలో ఉపశతించు (వందకు దగ్గరగా)
ఉపసహస్రించు (వెయ్యింటికి దగ్గరగా)
ఉపాయుతించు (పదివేలకు దగ్గరగా)
ఉపలక్షించు (లక్షకు దగ్గరగా)
ఉపకోటించు (కోటికి దగ్గరగా)
ఉపశతకోటించు (బిలియనుకు దగ్గరగా) మొ.

వచ్చే టపాలో అచ్చతెలుగు ఉపసర్గల గురించి.....
తెలుగులో క్రియాకల్పన సాధనాలు - 5

(Verbification Tools in Telugu)
తెలుగులో సంస్కృత ఉపసర్గల ప్రయోగ సరణి : సంస్కృత ఉపసర్గల్ని తఱచుగా సంస్కృత తత్సమాల ముందే చేర్చి ప్రయోగించడం తెలుగులో ఆనవాయితీ.ఇందుకు సకృత్తుగా అపవాదాలు (exceptions) లేకపోలేదు.

ఉదా :- దుర్ + అలవాటు = దురలవాటు = దురభ్యాసం

ని: + సిగ్గుగా = నిస్సిగ్గుగా (నిర్లజ్జగా)

ని: + మొహమాటంగా = నిర్మొహమాటంగా (మొహమాటం లేకుండా)

అతి + తిండి = అతితిండి

ప్రతి + వాడు = ప్రతివాడూ

ని: + పూచీ మనిషి = నిష్పూచీ మనిషి (బాధ్యతారహితుడు)

ని: + పేచీ ఆస్తి = నిష్పేచీ ఆస్తి ( చట్టపరమైన పేచీలు గొడవలూ లేని నిర్వివాద ఆస్తి)

సమ్ + కూడు = సమకూడు

సమ్ + కూర్చు = సమకూర్చు

సకృత్తే అయినప్పటికీ విశేషాన్ని సామాన్యీకరించే (generalizing the particular) న్యాయం చొప్పున ఈ అరుదైన పదాల శైలిని ఇతర తెలుగు పదాలకు సైతం విస్తరించాలి.ఈ క్రిందివి నేను నిష్పాదించినవి.

ఉదా:- ఉపగుంపు, అపవాడకం (దుర్వినియోగం), అపతెల్పు (తప్పుడు సమాచారమిచ్చు), అనుకాచు/అనుకాపు (escort), అతెలుగంటి (un-telugu-ish) మొదలైనవి.

అవ్యయీభావ సమాసాల ద్వారా క్రియాపదాల నిష్పాదన :- సంస్కృతంలో ఉపసర్గల్ని prepositions లాగా ఉపయోగించే పద్ధతి ఒకటుంది.ఈ క్రింది సాంప్రదాయిక ఉదాహరణల్ని పరిశీలించగలరు.

1. ఉప + హరి = ఉపహరి (హరికి దగ్గరగా/హరికి దగ్గరగా ఉన్నటువంటిది)
2. అధి + గంగా = అధిగంగమ్ (గంగ వద్ద/గంగ వద్ద ఉన్నటువంటిది)
3. మధ్యే + మార్గమ్ = మధ్యేమార్గమ్ (దారి నడుమ/దారి నడుమ ఉన్నటువంటిది, జరిగినటువంటిది)
4. ప్రతి + రామ: = ప్రతిరామమ్ (రాముని గురించి/రాముని కొఱకు వ్రాసినది)
వీటిని అవ్యయీభావ సమాసాలంటారు.ఉపసర్గల సహాయంతో ముందు నామవాచకాల్ని అవ్యయీభావ సమాసాలుగా మార్చి తరువాత కావాల్సిన అర్థంలో వాటికి"ఇల్లుక్/ఇంచుక్"చేర్చుకుని క్రియాధాతువులుగా రూపొందించవచ్చు.ఉపసర్గలు చేర్చడానికి సంస్కృత పదాలు తెలియని పక్షంలో యథేచ్ఛగా తెలుగు పదాలకే వాటిని చేర్చి పని పూర్తి చేసుకోవచ్చు.

ఉదా:- అపమార్గించు = తప్పుదోవ పట్టించు (hijack)

అవనావించు/అవనౌకించు - నావలో నుంచి దిగు (disembark)

అనురూపిల్లు = conform (అనురూపత = conformity)

సఫలిల్లు = ఫలించు/సఫలమగు

సఫలించు = విజయవంతం చేయు

స్వస్థలించు = స్వస్థలానికి పంపు (repatriate)

పరాయించు = పరాయిగా చేయు (alienate) మొ.
తెలుగులో క్రియాకల్పన సాధనాలు - 4

(Verbification Tools in Telugu)
క్రియాధాతువుల ముందు చేర్చడానికి ఉపయోగపడే ఉపసర్గల (prefixes) ప్రస్తావన (topic) కొనసాగిస్తున్నాను.
కాలక్రమంలో ఈ కింది పదాల్ని కూడా ఉపసర్గలలా వాడడం మొదలుపెట్టారు.

1. కు - కొంచెం, చిన్న, తక్కువ, నీచం, హీనం, చెడ్డగా
ఉదా :- కుభోజనం (తక్కువ తినడం)
కుగ్రామం (hamlet) మొ.

2. సకృత్ - అరుదుగా (అసలు అర్థం - ఒక్కసారి అని)
3. ఆరాత్ - దగ్గరగా
4. పశ్చాత్ - తరువాత, వెనుక
5. సహ - కలిసి
6. పునస్/పునర్ - మళ్ళీ
7. సాక్షాత్ - ఎట్టెదుట
8. సదా - ఎల్లప్పుడూ
9. శశ్వత్ - శాశ్వతంగా
10.పురస్/పురో - ముందు
11.తిరస్/తిరో -వెనుక
12.ప్రాక్ - అంతకుముందు/ఇంతకుముందు, తూర్పుదిక్కు
ఉదా :- ప్రాక్-నన్నయ యుగం (pre-Nannaya period)
ప్రాచీనుడు - ముందటివాడు
ప్రాక్తనం - ప్రాచీనం

13. అర్వాక్ - ఇంతకు తరువాత
ఉదా :- అర్వాక్ నన్నయ యుగం (post-Nannaya period)
అర్వాచీనుడు - తరువాతివాడు

14.సమ్యక్ - సరిగా సమీచీనం - సరిగా ఉన్నటువంటిది.
15.ఉపరి - పైన
16.అధస్/అధో/న్యక్ - కింద
17.ద్రాక్ - త్వరగా
18.శనైర్/శనైస్ - నెమ్మదిగా (slow)
19.ఉచ్చైర్/ఉచ్చైస్ - బిగ్గరగా (loudly)
20.బహు/నానా - ఎక్కువగా, ఎక్కువ
21.మనాక్/కించిత్/ఈషత్ - తక్కువగా, కొంచెం
22.సద్యస్/సద్యో - వెనువెంటనే (immediately)
23.తథ్యం - నిజంగా 24.మృషా - అబద్ధంగా
25.ధ్రువం/నూనం/అవశ్యం - తప్పకుండా (sure)
26.ప్రాయో - తఱచుగా (oft, often)
27.బహిర్/బహిస్ - బయట
28.అంతర్/అంతస్ - లోపల
29.యుగపత్/ఏకదా - రెండూ ఒకేసారిగా (simultaneous)

వీటిని కూడా మనం ఇంకా ఎక్కువ క్రియాధాతువుల ముందు అవసరాన్ని బట్టి చేర్చి సద్వినియోగం చేసుకోవాలి.
తెలుగులో క్రియాకల్పన సాధనాలు - 3
(Verbification Tools in Telugu)
సంస్కృతం నుంచి కొత్త క్రియాధాతువుల్ని కల్పించాలంటే ఉపసర్గల (prefixes) గురించి తెలియాలి.నా బ్లాగు"నా సాహిత్యం" http://www.naasaahityam.blogspot.com/ లో నేను ఇప్పటికే చాలా సంస్కృత ధాతువుల్ని అర్థంతో సహా ఇచ్చాను.ఇంకా ఇస్తాను.సంస్కృత ధాతువుల గురించి పూర్తి పాఠం కావాల్సినవారు శ్రీమాన్ భట్టోజి దీక్షితులు రచించిన సిద్ధాంత కౌముది అనే గ్రంథాన్ని పట్టుకోండి.ఇది సంస్కృతంలో రాసిన దిండంత గ్రంథం.

ఆ ధాతువులకు ముందు ఉపసర్గల (prefixes)ని చేర్చడం తెలిస్తే క్రియాధాతువుల కల్పనలో మనం సగం దూరాన్ని అధిగమించినట్లే.ఈ పని చెయ్యడానికి మీరొక పెద్ద వైయాకరణ శిరోమణి కావాల్సిన పని లేదు.ఇది చాలా సులభం. మన తెలుగువాళ్ళందరికీ సుపరిచితం కూడా.

తెలుగులోని చాలా క్రియాధాతువుల ముందు ఇప్పటికే వాడుతున్న ఉపసర్గల్ని వాటి అర్థాల్ని పరిశీలించండి.అవి ప్రాథమికంగా 20.అయితే కాలక్రమేణ తరువాత్తరువాత ఇంకొన్ని పదాలు కూడా ఉపసర్గల్లా ప్రవర్తించడం (క్రియాధాతువులకు ముందొచ్చి చేరడం) మొదలుపెట్టాయి.

1. అప - తప్పుడుగా, మినహాయింపుగా, వేరే దారిలో
2. ఉప - అనుకూలంగా, సుఖంగా, మంచిగా, దగ్గరగా
3. అభి - ఎదురుగా
4. అవ - తక్కువగా
5. అతి - దాటి, మించి, మీరి
6. అను - వెనువెంటనే, తరువాత, అనుసరించి, పోలి ఉండే విధంగా
7. ఆ - మొదటి నుంచి చివరి దాకా
8. ని - లోపల (ని + ద్రా = తన లోపలికి తానే పరుగెత్తడం)
9. నిర్/నిస్ - బయటికి, లేకుండా
10.అధి - మీద, పక్కన
11.సు - మంచిగా, చక్కగా, నేరుగా
12.దుర్/దుస్ - చెడ్డగా
13.ప్ర - గొప్పగా
14.ప్రతి - ప్రత్యామ్నాయంగా, విరోధంగా, ఎదురుగా, తిరిగి, ఒక్కొక్కటి
15.వి - వేరుగా, లేకుండా, మరో విధంగా, మరో దిశలో
16.సం - కలిసి, మొత్తంగా, ఉత్తమంగా
17.పరా - అవతల
18.పరి - చుట్టూ
19.పి/అపి - రహస్యంగా, కప్పి ఉంచి
20.ఉత్/ఉద్ - పైకి

ఇప్పటికే ఈ ఉపసర్గలు చేరి ఉన్న పాతపదాలతో అర్థ విరోధం రాకుండా కొత్త పదాలు కల్పించాలి.రెండు మూడు ఉపసర్గల్ని ఒకేసారి ఒకే ధాతువుకు చేర్చడం కూడా వ్యాకరణ సమ్మతమే.వేదకాలంలో వీటిని వాక్యంలో ఎక్కడ పడితే అక్కడ చేర్చేవారు, ఇప్పటి ఇంగ్లీషులో లాగా (అహం ఆ గచ్ఛామి - నేను వస్తున్నాను అనడానికి " అహం గచ్ఛామి అనేవారు).కావ్యయుగంలో ఇవి క్రియాధాతువుల ముందే స్థిరపడ్డాయి.
తెలుగులో క్రియాకల్పన సాధనాలు - 2
(Verbification Tools in Telugu)
"ఇంచుక్, ఇల్లుక్" లని తెలివిగా పదాలకు చేర్చడం ద్వారా అంతులేనన్ని కొత్త క్రియాధాతువుల కల్పనకు తెలుగుభాష అవకాశమిస్తోంది.రెండూ ముఖ్యమైనవే. "ఇల్లుక్" చేర్పు తెలుగు నుడికారానికి స్వాభావికం కాని కర్మార్థక (passive voice) ప్రయోగాల ఆవశ్యకతని గణనీయంగా తగ్గిస్తుంది.
1. ఉదా (సవరిత వాడుక - modified usage):- ఆ వేగుతో అతను హెచ్చరిల్లాడు (హెచ్చరించబడ్డాడు- మేలుకున్నాడు. He got alert with the mail)

2. ఉదా (నిష్పన్న వాడుక - coined usage):- భవిష్యత్తులో వంద డాలర్ల లోపలే కంప్యూటర్లు అందుబాటిల్లుతాయి. (అందుబాటులోకి వస్తాయి-దొరుకుతాయి. Future PCS could be accessed/ accessible at just $ 100)

ఇక్కడ కొన్ని నియమాలు ప్రవర్తిస్తాయి.మనం కల్పించే పదాల శ్రావ్యతని బట్టి వాటిని పాటించడమో మానుకోవడమో చెయ్యొచ్చు.

1. ఉర్దూ పదాలకు "ఇంచుక్/ఇల్లుక్" చేర్చడానికి ముందు ఆ పదాల చివర "ఆయ్" చేరుతుంది.

ఉదా :- ఉడ్ (ఎగరడం) - ఉడ్ + ఆయ్ = ఉడాయ్ + ఇంచుక్ = ఉడాయించు (to decamp)

బనా (తయారు చెయ్యడం) - బనా + య్ = బనాయ్ + ఇంచుక్ = బనాయించు (to frame a criminal charge)
2. సంస్కృత పదాలకు ఇంచుక్ చేరే విధానం మనకందరికీ కొద్దో గొప్పో తెలుసు కనుక సవిస్తరంగా ఆ జోలికి పోను.విశేష వివరణలు కావాల్సినవారు చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణంలోని క్రియాపరిచ్ఛేదం చదవండి.అయితే ప్రస్తుతం ఈ మార్గంలో కూడా అవసరమైన పదాల కల్పన జరగడంలేదు.దీనికి సామాజిక కారణాలున్నాయి.సంస్కృత భాషా పరిజ్ఞానం చాలావరకు బ్రాహ్మణులకే పరిమితమైనది.ప్రస్తుతం మన తెలుగు బ్రాహ్మణులకు తెలుగే సరిగా రాదు.సంస్కృతం సంగతి చెప్పనక్కరలేదు.ఇలాంటి పరిస్థితిలో వారు ఎవరికీ ఏమీ నేర్పే సావకాశం లేదు.మిగతావారికేమో సంస్కృతంతో సంపర్కం ఎప్పుడూ లేదు.We are apparently living in age of cultural disconnect with our history and past.ఏతావతా మనం ఇంగ్లీషు పదాలకు దీటైన దేశిపదాల్ని పట్టుకోవడంలో విఫలమౌతున్న దశాపరిణామం గోచరిస్తోంది.నేను కొంత ప్రదర్శిస్తాను.తరువాత ఎవరైనా ప్రయత్నించండి.

ఉదా:- పుస్తకం (book) - పుస్తకించు (booking) వీణ్ణి జేబుదొంగగా పుస్తకించండి. (నమోదు చెయ్యండి. Book him as a pickpocket)

మార్గం (route) - మార్గించు (routing) పేపాల్ ద్వారా ఈ చెల్లింపుని మార్గించాను (మార్గం కల్పించాను) - పేపాల్ పద్ధతిలో (మార్గంలో) ఈ చెల్లింపుని పంపించాను. (I routed this payment through Paypal)

"ఇంచుక్" ఉపయోగించి ప్రసిద్ధ సంస్కృత వ్యక్తుల/దేవతల పేర్లని కూడా క్రియాధాతువులుగా మార్చొచ్చు.అలాంటివి ఒకటిరెండు ఇప్పటికే సుప్రసిద్ధం. ఉదా : భీష్ముడు - భీష్మించుట, శివాలెత్తుట మొ.

మఱికొన్నిటిక్కూడా అవకాశముంది.కాని అలాంటి క్రియాధాతువులు అర్థం కావాలంటే వారి గుణగణాలు కొంచెమైనా తెలియాలి.

ఉదా : విక్రమార్కించు = పట్టువదలకపోవు

జయచంద్రించు = విదేశీయులకు తోడ్పడు

కుంభకర్ణించు = లోకోత్తరంగా నిద్రపోవు మొదలైనవి.


ఇంకా చాలా విషయాలు వచ్చే టపాలో....
తెలుగులో క్రియా కల్పన సాధనాలు-1
(Verbification Tools in Telugu)

మనం మూడు రకాల పదాల్ని కల్పించాల్సి ఉందని ఇదివరకటి ఒక చర్చాహారం(thread)లో అనుకున్నాం.వాటిల్లో మొదటి విభాగం క్రియాధాతువులు.ఏ భాషలో నైనా ప్రాథమిక క్రియలు కొన్నే ఉంటాయి.మిగతా క్రియలన్నీ నామవాచకాల(nouns)ని విశేషణాల్ని(adjectives)రూపాంతరించగా ఏర్పడ్డవై ఉంటాయి.ఇలా క్రియల్ని కల్పించడానికి తెలుగుభాష అందిస్తున్న సౌకర్యాల గురించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం.

తెలుగులో క్రియా ధాతువులు అంతమయ్యే విధానాన్ని ముందు అధ్యయించాలి.

1. "చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు.ఉదా :- కాచు, గీచు, చాచు, తోచు, దాచు, దోచు, పాచు, రాచు, వాచు, వీచు, వేచు మొదలైనవి.

2. అనుస్వార పూర్వకమైన (సున్నా ముందు గల)"చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- దంచు, దించు, తెంచు, మించు, ఉంచు, ఎంచు, పంచు, వంచు మొదలైనవి.

3. ద్విరుక్త (వత్తు) "చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు :- ఉదా :- తెచ్చు, గుచ్చు, నచ్చు, నొచ్చు, పుచ్చు మొదలైనవి.

4. "చు" తో అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- నడచు, ఒలుచు, పొడుచు, విడచు మొదలైనవి

5. "ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే అచ్చతెలుగు క్రియాధాతువులు. ఉదా :- గురించు (addressing), ఆకళించు (explain), సవరించు (amend), సవదరించు (edit) మొదలైనవి.

6. "ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే ప్రేరణార్థక క్రియా ధాతువులు. ఉదా :- చేయించు ("చేయు" కు ప్రేరణార్థకం) కదిలించు ("కదులు" కు ప్రేరణార్థకం) మొదలైనవి.

7. "ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే తత్సమ (సంస్కృత/ప్రాకృత)క్రియా ధాతువులు (ఇవి లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి) : ఉదా :- ధరించు, బోధించు, సంహరించు మొదలైనవి.

8. "యు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- ఏయు, కాయు, కోయు, కూయు, డాయు, తీయు (తివియు), తోయు, మోయు, మ్రోయు, వేయు మొదలైనవి.

9. "యు" తో అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- తడియు, వడియు, జడియు, అలియు, తెలియు, పులియు, ఉమియు, విరియు మొదలైనవి.

10. "ను" తో అంతమయ్యే క్రియాధాతువులు. ఉదా :- తిను, కను, విను, మను, అను, చను, కొను మొదలైనవి.

11. సామాన్య క్రియా ధాతువులు. ఉదా :- సాగు, వెళ్ళు, అదురు వదులు, పగులు, మిగులు మొదలైనవి.

12. విశేష క్రియా ధాతువులు (special verbs). ఉదా :- ఉండు, పోవు, చూచు, అగు, వచ్చు, ఇచ్చు, చచ్చు మొదలైనవి.

మరొక విషయం :- తెలుగులో క్రియలు రెండు విధాలుగా ఉంటాయి. 1.సకర్మక క్రియలు (transitive verbs) 2. అకర్మక క్రియలు (intransitive verbs)

సూత్రం -1. సకర్మక క్రియలకు మాత్రమే చివర "ఇంచుక్" ప్రత్యయం వస్తుంది.
ఉదా :- ధరించు : ఆయన కిరీటం ధరించాడు. (ఇక్కడ ధరించు అనే క్రియకు కిరీటం కర్మ కనుక ఇది కర్మ గలిగిన సకర్మక ధాతువు)

సూత్రం-2. అకర్మక క్రియలకు చివర "ఇల్లుక్" వస్తుంది. ఉదా :- ఆమె హృదయేశ్వరిగా విరాజిల్లింది. (ఈ వాక్యానికి కర్మ లేదు కనుక "విరాజిల్లు" అకర్మక ధాతువు)

కాబట్టి మనం ఇంచుక్ బదులు ఇల్లుక్ చేర్చడం ద్వారా సకర్మక ధాతువుల్ని అకర్మక ధాతువులుగా మార్చడానికి తెలుగుభాష అవకాశం కల్పిస్తోంది. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు.

ఇంచుక్ = చేయు
ఇల్లుక్ = అగు

ఈ మార్గంలో కల్పించదగిన కొన్ని పదాలు : సన్నగిల్లు - సన్నగించు (సన్నగా అయ్యేలా చేయు) పరిఢవించు - పరిఢవిల్లు తొందఱించు - తొందఱిల్లు మొదలైనవి.

ఇంకా చాలా విషయాలు రాబోయే టపాలలో....
ఇంగ్లీషులో కొత్త పదాల నిష్పాదన ఎలా జరిగింది - 2
7. నామవాచకాల క్రియాకరణం (Verbification of nouns) : ఆధునిక ఇంగ్లీషు అన్ని రంగాల్లోను వాయువేగ మనోవేగాలతో దూసుకుపోవడానికి ఈ చర్య దోహదించినంతగా మఱింకేదీ దోహదించి ఉండలేదు.ఈనాటి ఇంగ్లీషులో ఏ (noun) నామవాచకాన్నయినా సరే క్రియాధాతువు(verb-root)గా మార్చి వాడుకునే సౌలభ్యముంది.అసలు అవి మౌలికంగా క్రియలా ? నామవాచకాలా ? అని సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడేటంతగా ఈ ప్రక్రియ విశ్వవ్యాప్తమైంది.ఆఖరికి పొడిపదాల్ని (abbreviations) కూడా క్రియలుగా మార్చేసి SMSing అని వాడుతున్నారు.

వ్యక్తినామాల (proper nouns)ని సైతం క్రియలుగా మార్చేశారు. Charles F. Boycott అనే బ్రిటిష్ భూస్వామి అడిగినంత కూలీ ఇవ్వట్లేదని ఆయన ఎస్టేట్లో పనిచేసే రైతుకూలీలంతా సమ్మెచేసి పనులకి దూరంగా ఉంటే, దానికి boycotting అని పేరొచ్చింది.ఇలాంటివి మన తెలుగులో కూడా ఒకటి-రెండు లేకపోలేదు.ఉదా:- భీష్మించడం. ఈ క్రియ తెలుగులోనే ఉంది కానీ సంస్కృతంలో లేదు.

8. సమాస ఘటనం : (word-compounds) ఇంగ్లీషు మేధావులు గత శతాబ్దాల్లో ఉనికిలో లేని కొన్ని వ్యాకరణ సంప్రదాయాల్ని తమ భాషలో ప్రవేశపెట్టారు.వాడుకలో బహుళ ప్రాచుర్యం పొందినప్పటికీ ఇంగ్లీషు వ్యాకరణాల్లో మాత్రం ఆ నిర్మాణాలకు ఇప్పటికీ సముచిత స్థానం లేదు. వాటిల్లో సమాసాలొకటి. సమాసం రెండు వేరు వేరు అర్థాలు గల పదాలతో ఏర్పడే మిశ్రమం.ఆ మిశ్రమం నుంచి ఉప్పతిల్లే కొత్తపదం ఒక కొత్త అర్థాన్ని కూడా స్ఫురింపజేస్తుంది.ఉదా :- రాజ భవనం.ఇది రాజు కంటే, భవనం కంటే వేరైన ఒక ప్రత్యేకమైన శ్రేణికి చెందిన కట్టడాన్ని సూచిస్తుంది.సమాసాల సౌలభ్యాన్ని ఇంగ్లీషు మేధావులు త్వరగానే గ్రహించారు.ఇప్పుడు సమాసాలు లేకుండా ఇంగ్లీషు మాట్లాడ్డమే అసాధ్యం.ఒకవేళ అలా మాట్లాడితే ఇంగ్లీషు రాదేమోనని జాలిపడడం కూడా జరగొచ్చు.
1. Customer-care = care for customers
2. User-friendly = friendly to the user
3. User-serviceable = serviceable by the user
4. Gas dealer = Dealer in gas
5. Expiry date = date of expiry
6. God-forsaken = forsaken by God
7. Bible-thumping = thumping the Bible
8. A London-bound airliner = An airliner bound to London
9. Earth-fill = Filling with earth
10.sky-diving = diving in the sky
11.trustworthy = worthy of trust
ఇంగ్లీషులో కొత్త పదాల నిష్పాదన ఎలా జరిగింది - 1
మార్గదర్శకాల గురించి మఱికొంత రాస్తున్నాను.

కొందరు తలపోస్తున్నట్లుగా ఇంగ్లీషులో ఈనాడు మనకు కనిపించే పదాలు ఇతర భాషల నుండి మక్కికి మక్కి దిగుమతి చేసుకున్నవి కావు.ఆకాశం నుంచి హఠాత్తుగా ఊడిపడ్డవీ కావు.వాటి వెనుక ఇంగ్లీషు మేధావుల కృషి చాలా ఉంది.అలాంటి కృషినే ఇప్పుడు మనం కూడా చెయ్యాలనుకుంటున్నాం.కొత్త పదాల రూపకల్పన చేసేటప్పుడు ఇంగ్లీషు మేధావులు అనుసరించిన పద్ధతుల్నే మనం ఇప్పుడు చర్చిస్తున్నాం.

1. పోలిక (Analogy) :- అంతకుముందున్న పదాలకు సంబంధించిన కొత్త పదాలు అవసరమైనప్పుడు ఆ పదాల స్వరూపానికి కొద్దిగా మార్పులూ చేర్పులూ చేసి వేరే అర్థంలో వాడారు.అంతకుముందు కేవలం uncanny అనే పదం ఒక్కటే ఉండగా canny అనే పదాన్ని కల్పించారు.అంతకుముందు gnostic (ఒక ప్రాచీన క్రైస్తవ శాఖ సభ్యుడు) ఒక్కటే ఉండగా agonstic (అజ్ఞేయవాది, నాస్తికుడు) అనే పదాన్ని కల్పించారు.outrage అనేది అచ్చమైన ఆంగ్లో-శాగ్జన్ పదం కాగా దానికి విశేషణంగా outrageous అని లాటిన్ శైలిలో కల్పించారు.అంటే ఉన్న పదాల నుండే కొత్త పదాల్ని కల్పించారు.అలా కల్పించడం ఇంగ్లీషు/లాటిన్ వ్యాకరణ సూత్రాలకు విరుద్ధమైనా లెక్కచెయ్యలేదు.సూత్రాలు వర్తింప శక్యమైతే పాటించారు. పాటించడానికి అవకాశం లేనిచోట త్రోసిపుచ్చారు.

2. ధ్వన్యనుకరణ (Imitation) :- మనుషులు భావోద్వేగపు క్షణాల్లో చేసే అవ్యక్త కాకుస్వరాలకూ ధ్వనులకూ శబ్ద ప్రతిపత్తిని కల్పించారు.ఆ ధ్వనులకు- తెలిసిన ప్రత్యయాల్ని జోడించి కొత్త పదాల్ని నిష్పాదించారు.ఆ క్రమంలో lispism, yahoo, pooh-poohing, booing మొదలైన పదాలు పుట్టాయి.మనవాళ్ళు కూడా "చకచక, నిగనిగ" నుంచి చాకచక్యం, నైగనిగ్యం, నిగారింపు మొదలైన పదాల్ని నిష్పాదించారు.అయితే ఈ ప్రక్రియ ఇటీవలి కాలంలో వెనకబట్టింది.

3. అర్థాం